Amaravati Projects Get Wings: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు వేగం పెంచే లక్ష్యంతో ‘అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్’ (Amaravati Growth and Infrastructure Corporation Limited) పేరుతో ఒక ప్రత్యేక వాహక సంస్థ (SPV – Special Purpose Vehicle)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కొత్త ఎస్‌పీవీ అమరావతిలోని కీలక ప్రాజెక్టులైన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, ఐకానిక్ బ్రిడ్జి, ఇన్నర్ రింగ్ రోడ్ (IRR), రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి భారీ నిర్మాణాల అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతలను స్వీకరించనుంది. ఈ సంస్థ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) ప్రాజెక్టులను పర్యవేక్షించడం మరింత సులభతరం కానుంది.
కీలక అధికారుల నియామకం:
ఈ ఎస్‌పీవీలో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. డైరెక్టర్ల బోర్డులో ఆర్థిక, ఇంధన, రవాణా, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు సీఆర్‌డీఏ కమిషనర్ వంటి కీలక అధికారులను నామినేట్ చేయడం ద్వారా, అమరావతి అభివృద్ధి పనులకు వివిధ శాఖల సమన్వయం లభించనుంది. రూ.10 కోట్ల అధీకృత మూలధనంతో మొదలైన ఈ సంస్థ, నిధులు సమీకరించే విషయంలో పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేయనుంది. రాజధాని నిర్మాణానికి వేగవంతమైన, సంస్థాగతమైన రూపునిచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయంపై అమరావతి వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


