Signature Bridge over Krishna River Amaravati : నవ్యాంధ్ర రాజధాని అమరావతి, కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ నగరాల మధ్య బంధాన్ని మరింత దృఢంగా మలచేందుకు అద్భుతమైన ఇంజినీరింగ్ అద్భుతం రూపుదిద్దుకుంటోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నిత్యం నరకయాతన చూపిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారంగా.. కృష్ణా నదిపై కన్నుల పండగలా నిలిచేలా ప్రతిష్టాత్మక “సిగ్నేచర్ బ్రిడ్జి” నిర్మాణానికి తొలి అడుగు పడింది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (AGICL) ఇప్పటికే దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ, డీపీఆర్ (DPR) తయారీ కన్సల్టెన్సీ కోసం టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసింది.
ఎలివేటెడ్ డిజైన్ – అంతర్జాతీయ ప్రమాణాలు : ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను, మచిలీపట్నం-హైదరాబాద్ జాతీయ రహదారిని (NH-65) అనుసంధానిస్తూ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. 1.10 కిలోమీటర్ల పొడవునా ఎలివేటెడ్ విధానంలో 6 వరుసలతో అంతర్జాతీయ నాణ్యతతో దీనిని తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికుల సురక్షిత రాకపోకలతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈపీసీ (EPC) పద్ధతిలో చేపట్టే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం, కాన్సెప్ట్ డిజైన్లను ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ 3 నెలల్లో ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
రాజధానికి ల్యాండ్‌మార్క్ గేట్‌వే : అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే ఈ వంతెన రాజధానికి ఒక ప్రధాన ముఖద్వారంలా (గేట్‌వే) నిలవనుంది. వంతెన నిర్మాణానికి అవసరమైన భారీ వ్యయం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమీకరించనున్నారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్ – పారిశ్రామిక పురోగతి : నిత్యం లక్షలాది వాహనాలతో కిటకిటలాడే ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ ఒత్తిడిని ఈ నూతన వంతెన గణనీయంగా తగ్గిస్తుంది. ఎన్‌హెచ్-65తో నేరుగా అనుసంధానం కావడం వల్ల జిల్లాల మధ్య సరుకు రవాణా వేగవంతమై ప్రాంతీయ పారిశ్రామిక ప్రగతికి, ఆర్థిక వ్యవస్థకు నూతన ఊపిరి పోస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

