మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అద్భుతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు హాఫ్ సెంచరీ చేసినప్పుడు ‘పుష్ప’ స్టైల్లో తగ్గేదేలే ట్రేడ్ మార్క్‌తో సెలబ్రేషన్ చేసుకున్నాడు.
అయితే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నితీశ్ కుమార్ రెడ్డి సెలబ్రేషన్స్ వీడియోను పంచుకుంటూ తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. “ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోను వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా” అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో అంబటి ట్వీట్ వైరల్ అవుతోంది.
కాగా ఇటీవల సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం.. అనంతరం సినీ ఇండస్ట్రీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై అంబటి వ్యంగ్యంగా ట్వీట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.