ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్(Anagani Satyaprasad) మాట్లాడుతూ.. అమరావతి భూమల రిజిస్ట్రేషన్లపై కీలక ప్రకటన చేశారు. అమరావతి(Amaravati) ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగదని స్పష్టం చేశారు. అయితే విజయవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుదలకు సంబంధించి త్వరలో సమావేశం ఉంటుందన్నారు.
గుంటూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బుక్ వాల్యూ తక్కువే ఉందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల తగ్గిస్తే.. మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. నాలా పన్ను కూడా రేషనలైజ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని విమర్శించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలనూ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని అనగాని వెల్లడించారు.