CM Chandrababu Slams Fake Propaganda: మెుంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ సహాయక చర్యలపై వస్తున్న విమర్శలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం యంత్రాంగం రాత్రింబవళ్లు పనిచేస్తోందని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారం చేస్తూ.. ప్రజల్లో అపోహలు రేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రూ.5వేల 265 కోట్ల భారీ నష్టం వాటిలిన్న సమయంలో తప్పుడు ప్రచారాలు ఏంటంటూ ఖండించారు.
కొంత మంది ఫేక్ మనుషులు ప్రభుత్వంపై బురద జల్లేందుకు కావాలనే ఫేక్ ప్రచారాలు చేస్తుంటారని, వాళ్ల బతుకే అంత అంటూ సీఎం సీరియస్ అయ్యారు. ఇంత కష్టపడుతుంటే ప్రశంసించకపోయినా ఫర్వాలేదు.. కనీసం సైలెంట్‌గా అయినా ఉండాలి కదా అంటూ బుద్ధిచెప్పారు. జరుగుతున్న వాస్తవాలను పరిశీలించకుండా.. ప్రతి దానిని రాజకీయాల కోసం వాడుకునేందుకు వక్రీకరించి మాట్లాడటం, తప్పుడు ప్రచారం చేయడం విలయాల సమయంలో తప్పని సీఎం తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మెుంథా తుఫాన్ కారణంగా తీరప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులను, అక్కడి ప్రజలకు జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రభుత్వ బృందాలు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు.
విపత్తులో కూడా రాజకీయ ప్రయోజనం కోసం దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని, ఇకనైనా ఇలాంటివి మానుకుంటే మంచిదని చంద్రబాబు సూచించారు. సహాయక చర్యలను రాజకీయరంగంలోకి తేవడం చాలా చిన్నపాటి మనస్తత్వానికి నిదర్శనంగా చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడానికి చేసే ప్రతి ప్రయత్నం చివరికి తప్పక విఫలం అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తుఫాన్ బాధితులకు తక్షణ సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించిందని, రైతులకు నష్టపరిహారం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ చర్యలు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అన్ని జిల్లా కలెక్టర్లు, అధికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని, ప్రధాన కార్యదర్శి స్థాయిలో సమీక్ష జరుగుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మెుద్దని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సూచించారు.


