Atchannaidu Slams Jagan: మొంథా తుపాను బీభత్సంతో రాష్ట్ర ప్రజలు కష్టాల్లో అల్లాడుతుంటే, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి మాత్రం గదిలో కూర్చొని పచ్చి అబద్ధాల విష ప్రచారం చేస్తున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించిన వ్యక్తి, రాష్ట్రం ప్రకృతి విపత్తులో చిక్కుకున్నా కనీసం ప్రజల వద్దకు రాకుండా, కేవలం విమానం లేదన్న సాకుతో బెంగళూరులో ఉండిపోయి, ఇప్పుడు సిగ్గులేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
రైతు సంక్షేమంపై ‘జగన్ అబద్ధాలు’: చర్చకు సవాల్!
తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని పెనమలూరు, వెంట్రుపగడ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశాలపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన నిశితంగా ఖండించారు. ‘పంటల బీమా విషయంలో జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. దమ్ముంటే జగన్ చర్చకు రావాలి’ అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
గత వైసీపీ ప్రభుత్వం 40% కూడా చేయలేని ఈ-క్రాప్ నమోదును తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 95% పూర్తి చేసిందన్నారు. దీని ద్వారా రైతులకు మెరుగైన ప్రయోజనాలు చేకూరతాయని ఆయన వివరించారు. మామిడి పంటకు క్వింటాలుకు రూ.4 చొప్పున ఇచ్చి దాదాపు రూ.300 కోట్లు ఖర్చు పెట్టి ఆదుకుంటే, మామిడి రైతులను పట్టించుకోలేదంటూ జగన్ దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.6,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు.
గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటా బీమా ప్రీమియంను చెల్లించలేదని, ఈ విషయాన్ని అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బహిరంగంగా చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. రైతుల విషయంలో ప్రతి అడుగులోనూ అబద్ధాలు ప్రచారం చేస్తూ వైకాపా నాయకులు పదే పదే అభాసుపాలవుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను గాలికి వదిలేసి, ప్రచారానికే పరిమితమైన వైకాపా తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.


