Gudipalli Aerospace Investment: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల పెట్టుబడులపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మరో పెద్ద సంస్థతో జత కలుగుతోంది. రేమండ్ గ్రూప్ రాష్ట్రంలో రూ.943 కోట్ల పెట్టుబడితో రెండు ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 5,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రేమండ్ గ్రూప్ అనంతపురం జిల్లా గూడిపల్లిలో రూ.430 కోట్ల పెట్టుబడితో ఆటో కంపొనెంట్ తయారీ యూనిట్‌ను స్థాపించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 4,096 మందికి ఉద్యోగాలు అందించనుంది. దీనికి ప్రభుత్వం 30 ఎకరాల భూమిని కేటాయించింది. అదేవిధంగా రేమండ్ గ్రూప్‌కు చెందిన జేకే మైని గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ, గూడిపల్లి.. టెకులోడులో ఏరోస్పేస్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి మరో రూ.510 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది. ఈ యూనిట్‌ల ద్వారా 1,400 మంది యువతకు ఉపాధి కలగనుంది. ఈ ప్రాజెక్ట్‌ల కోసం ప్రభుత్వం 47.28 ఎకరాల భూమిని కేటాయించబోతోంది.
ఈ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 కింద ప్రత్యేకంగా అమలు చేయబడతాయి. ఫ్యాక్టరీల నిర్మాణం 2026 మార్చిలో ప్రారంభమై.. కమర్షియల్ ఉత్పత్తి 2027 మేలో ప్రారంభం కానుంది. జేకే మైని ప్రిసిషన్ టెక్నాలజీ రేమండ్ గ్రూప్‌కు అనుబంధ సంస్థగా 1973లో స్థాపించబడింది. 2004లో ఏరోస్పేస్ రంగంలో అడుగు పెట్టిన ఈ సంస్థ.. ఉన్నత నాణ్యత గల మెషీన్డ్ కంపొనెంట్లు, అసెంబ్లీలు, ఏరో స్ట్రక్చర్లు తయారు చేస్తోంది. ఇక రేమండ్ లిమిటెడ్ మైని గ్రూప్‌ల సంయుక్త భాగస్వామ్యంతో జేకే మైని గ్లోబల్ ఏరోస్పేస్ అనే సంస్థ 2025 ఆగస్టులో అధికారికంగా ప్రారంభమైంది.
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహక విధానాలను “వర్షన్ 4.0” రూపంలో ప్రవేశపెట్టింది. ఇందులో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ, ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ పాలసీలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు సులభమైన అనుమతులు, ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్‌లు, సింగిల్ విండో వ్యవస్థ వంటి సదుపాయాలతో పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు రూ.3.1 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కూటమి దూకుడుకు ఇదొక మైలురాయిగా నిలుస్తుందని తెలుస్తోంది.


