Ys jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న నాలుగో సమావేశాలు ఇవి. ఈ సమావేశాలకు మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష హోదా లేదనే సాకుతో గత మూడు సమావేశాలకు గైర్హాజరైన జగన్, ఈసారి కూడా అదే వైఖరి అవలంబిస్తారా అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
అనర్హత వేటు భయం.. ఉప ఎన్నిక చర్చ
గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా గుర్తింపు పొందలేదు. దీనిని కారణంగా చూపి, తాను అసెంబ్లీకి రానని జగన్ గతంలోనే స్పష్టం చేశారు. అయితే, వరుసగా 60 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యులపై అనర్హత వేటు పడుతుందని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనల మేరకు జగన్‌తో సహా మిగతా ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ఇదే జరిగితే పులివెందులలో ఉప ఎన్నిక రావడం ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా స్పష్టం చేశారు.
సానుభూతి వ్యూహమా? లేక తప్పదా?
అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అనర్హత వేటును ఒక సానుభూతి వ్యూహంగా ఉపయోగించుకోవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సభకు హాజరు కావడం కన్నా, అనర్హత వేటు పడితే ప్రజల నుంచి సానుభూతి లభిస్తుందని జగన్ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. కానీ, మరోవైపు ఆరుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.
చంద్రబాబు ఎదుర్కొన్న కష్టాలు.. జగన్‌కు అనుభవమే!
2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చుంది. అప్పుడు చంద్రబాబు ఎంతో హుందాగా అసెంబ్లీకి హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి అవమానాలు ఎదురైనప్పటికీ సభలో నిలబడ్డారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలకు తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. అప్పట్లో ఆ అవమానాలను దగ్గరుండి చూసిన జగన్‌కు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎదురైన అవమానాలను దృష్టిలో ఉంచుకునే జగన్ సభకు రాలేకపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈసారి జగన్ సభకు హాజరై తన వైఖరిని స్పష్టం చేస్తారా, లేదా అనర్హత వేటును ఎదుర్కోవడానికి సిద్ధమవుతారా అనేది వేచి చూడాలి. వైఎస్సార్‌సీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈ ఉత్కంఠకు తెర పడే అవకాశం ఉంది.


