Speaker Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు. అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలనే నిబంధనను తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. సభకు రాకుండా బయట ప్రభుత్వం గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఆయన పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆదివారం తిరుపతిలో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సులో అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతకు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు తండ్రి ఆస్తిలో సగం వాటా చట్టం తెచ్చారని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. అలాగే, స్వయం సహాయక బృందాల (SHG) ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు.
ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులు కల్పించడం, ఒక మహిళ (వంగలపూడి అనిత) హోం మంత్రిగా ఉండటం, మరొక మహిళను అసెంబ్లీకి స్పీకర్‌గా ఎంపిక చేయడం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శమని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తిరుపతిలో మహిళా యూనివర్సిటీని స్థాపించింది కూడా ఎన్టీఆరేనని గుర్తు చేశారు. ఈ సదస్సులో ఆయన హోం మినిస్టర్ వంగలపూడి అనితను అందరికీ పరిచయం చేశారు. మహిళల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.


