Bus Accident:అల్లూరి సీతారామరాజు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఒక భయంకర రోడ్డు ప్రమాదం లో సుమారు 15 మంది మృతి చెందారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో తులసిపాకల గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయానికి బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కొండచరియలు, వంకర్లు మలుపులు..
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం కొండచరియలు, వంకర్లు మలుపులు ఎక్కువగా ఉండే ప్రాంతం. రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటం, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మార్గంలో చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది. తెల్లవారు జామున మూడుగంటల సమయంలో ప్రయాణిస్తున్న ఈ బస్సు ఒక్కసారిగా అదుపు కోల్పోయి లోయలోకి దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షుల నుండి తెలిసింది. వాహనం పడిన లోతు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు బయటపడే అవకాశం లేకుండా పోయింది.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/cold-wave-in-andhra-pradesh/
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల అరుపులు, సహాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చింతూరు పోలీసు బృందం తక్షణమే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించింది. బస్సు పూర్తిగా దెబ్బతిని లోయలో పడి ఉండటంతో లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడం చాలా కష్టంగా మారింది.
సంఖ్య పెరిగే అవకాశం..
ఈ రక్షణ చర్యల్లో పోలీసులు, స్థానిక గ్రామస్తులు గాయపడిన వారిని తొలుత లోయ నుంచి పైకి తీసుకువచ్చి అంబులెన్స్‌లను ఉపయోగించి సమీప ఆసుపత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అందువల్ల మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఇంకా స్పష్టంగా వెలుగులోకి రాలేదు. బస్సు వేగం ఎక్కువగా ఉండటమా, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమా, లేక ఏదైనా సాంకేతిక లోపమా అన్న విషయాలపై దర్యాప్తు జరుగుతోంది.
భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్లడానికి బయలుదేరిన ప్రయాణికులందరూ చిత్తూరు జిల్లాకు చెందినవారిగా తెలిసింది. యాత్ర కోసం వచ్చిన వారి ప్రయాణం విషాదంగా మారిపోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉదయం సమాచారాన్ని అందుకున్న బంధువులు తీవ్ర ఆందోళన చెందుతూ సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

