Andhra Pradesh Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేడు (శుక్రవారం) సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో 21 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా శనివారం ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించడానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.15000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేసింది. విజయవాడలో సింగ్ నగర్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే “ఆటో డ్రైవర్ల సేవ”పేరుతో కొత్త పథకానికి అంకురార్పణ చేసింది. ఈ పథకం ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద సుమారుగా 2 లక్షల 90 వేల మంది లబ్ధిదారులకు రూ.435 కోట్ల మేరకు అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. ఆటో డ్రైవర్ల సేవ పథకంతో పాటుగా మరికొన్ని ప్రతిపాదనలకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని పొందుతున్నారు. అయితే, ఈ పథకం అమలు ద్వారా ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గుతోందని వారు వాపోతున్నారు. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారంటూ వారి నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సేవలో పథకం ప్రారంభించనుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర పేరుతో ఈ పథకం అమల్లో ఉండేది. వైసీపీ హయాంలో వాహనమిత్ర పథకం కింద ఏటా రూ.10 వేల సాయం అందించేవారు. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఆటో డ్రైవర్ల సేవలో అని మార్చి ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
కాగా, ఇదే కేబినెట్ సమావేశంలో ఆటో డ్రైవర్ల పథకంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ పాలసీ, అమరావతి భూసేకరణ, పర్యాటక ప్రాజెక్టులు, చట్టసవరణలు వంటి 20 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.కేబినెట్ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాల గురించి తెలుసుకుందాం.
1. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2. జలవనరుల శాఖకి సంబంధించిన వివిధ పనుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
3. కారవాన్ పర్యాటక ప్రాజెక్ట్, అమృత్ పథకం 2.0 పనులకు ఆమోదం.
4. రాజధాని అమరావతి భూసేకరణ: ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకోవడానికి ఆమోదం.
5. అమరావతి వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటు.
6. రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం.
7. కుష్ఠు వ్యాధి పదాన్ని తొలగించేందుకు చట్టసవరణ చేస్తామని నిర్ణయం.
8. విద్యుత్ శాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు, అలాగే కార్మిక చట్టాల్లో సవరణలు మంత్రివర్గం ఆమోదించింది.
9. గతంలో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే పోటీ చేసే అనర్హతను నీటి సంఘాల ఎన్నికల నుంచి మినహాయింపుకు కేబినెట్ ఆమోదం.
10. హంద్రీ నీవాలో అమిద్యాల లిఫ్ట్ పనుల పునరుద్ధరణ
11. ప్రకాశం బ్యారేజ్, దివిసీమలలో వరద నష్టం పనులకు ఆమోదం
12. వైఎస్సార్ కడప జిల్లాలో మైలవరం రిజర్వాయర్‌కి 3.19 కోట్లతో మరమ్మత్తులు
13. తిరుమల, తిరుపతికి నీటి ప్రాజెక్ట్ కోసం 126 కోట్లకు కేబినెట్ ఆమోదం


