Free Bus Scheme for Women: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి మహిళా ప్రయాణికురాలికి జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని, ఆ టికెట్‌లో ఆమె పొదుపు చేసిన మొత్తం వివరాలు ఉండాలని ఆదేశించారు. ఈ పథకం విజయవంతంగా అమలు చేయడానికి సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఈ ఉచిత బస్సు పథకం రూపొందింది. రాష్ట్రంలోని సుమారు 15 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించే అవకాశం ఉందని అంచనా. ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారమవుతుందనే ఆందోళనలు ఉన్నప్పటికీ, మహిళల ఆర్థిక సాధికారత కోసం దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భవిష్యత్తులో మొత్తం ఏసీ బస్సులే
అధికారులు కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ఇలాంటి పథకాలను అధ్యయనం చేసి, ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను ఆక్యుపెన్సీకి తగ్గట్టు సర్దుబాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పర్యావరణ హితం, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టే బస్సులన్నీ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) ఏసీ బస్సులుగా ఉండాలని ఆదేశించారు.


