Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇటీవల ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
వాయుగుండం క్రమంగా వాయువ్య దిశగా తమిళనాడు–ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ వైపు సాగుతూ బలపడుతుంది. ఇది ఎనిమిదవ తేదీ ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 8వ తేదీ నుంచి 10 వరకు వర్షాలు పడొచ్చు. కోస్తా తీరంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురవొచ్చు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అలాగే తుపాను ముప్పు ఉండే ప్రాంతాల్లోని అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తమిళనాడుకు సంబంధించి అధికారులు 13 జిల్లాలకు ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు విపత్తు నిర్వహణ బృందాల్ని అప్రమత్తం చేశారు.