Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. జ్వరం ఉన్నప్పటికీ, ఆయన సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరై, కీలకమైన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. కానీ సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరగడంతో, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు తక్షణ చికిత్స అందించారు.
వైద్య పరీక్షల అనంతరం, వైద్యులు పవన్ కళ్యాణ్‌కు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. కనీసం రెండు రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆయన త్వరగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే, అనారోగ్యంతో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను విస్మరించలేదు. అధికారులతో నేరుగా సమావేశాలు నిర్వహించలేకపోయినప్పటికీ, ఆయన తన శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అధికారులతో టెలీ-కాన్ఫరెన్స్‌ల ద్వారా సంప్రదింపులు కొనసాగించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో, పాలనలో ఏ మాత్రం జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని జనసేన కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని కోరుకుంటున్నారు.


