AP DSC 2026 Notification: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇచ్చిన మాట ప్రకారం ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
గురువారం విద్యాశాఖపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం, వచ్చే ఏడాది (2026) జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే ఏడాది మార్చిలోనే పరీక్షలు నిర్వహించి, వెంటనే ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి పరీక్షా విధానం పూర్తిగా పారదర్శకంగా, సాంకేతిక పద్ధతిలో ఉంటుందని మంత్రి తెలిపారు.
దీనికి ముందు, డీఎస్సీకి అర్హత కోసం ఉద్దేశించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను కూడా ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నవంబర్ (2025) మూడో వారంలో టెట్ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. టెట్ అర్హత సాధించిన వారే డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించిన ప్రభుత్వం, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలపై అధ్యయనం చేయడానికి 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్‌కు పంపిస్తామని లోకేశ్ ప్రకటించారు. దీనితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకతపైనా మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


