Beneficiary Management Scheme : దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఎటు చూసినా చదువుకున్న వారే దర్శనమిస్తున్నారు. అయితే వారి చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తున్నది మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎలాంటి ఉపాధి లేక నానాయాతన పడుతున్న వారైతే కోకొల్లలు. అలాంటి వారికోసం ఏపీ ప్రభుత్వం ఒక చక్కని అవకాశాన్ని పథకం రూపంలో తీసుకువచ్చింది. సామర్థ్యానికి తగ్గ ఉద్యోగం ఇంట్లో నుంచే చేసుకునేలా చర్యలు చేపట్టింది.
10వ తరగతి నుంచి పీజీ దాకా చదువుకున్న వారిని మరియు వివిధ దశల్లో చదువు ఆపేసిన వారిని అర్హులుగా ప్రకటించింది. వారిని గుర్తించేందుకై “కౌశలం” పేరుతో ఒక సర్వే సైతం మొదలు పెట్టింది. మొదటగా ఈ సర్వేను సచివాలయ సిబ్బంది చేపట్టారు. ఇప్పుడు స్వయంగా అభ్యర్థులే తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా https://gsws-nbm.ap.gov.in/BM/ సైట్‌ను సైతం తీసుకొచ్చింది.
ఎలా నమోదు చేసుకోవాలంటే: ఈ లింక్‌ను క్లిక్ చేయగానే Beneficiary Management Government of Andhra Pradesh అనే విండో అభ్యర్థులకు తెరుచుకుంటుంది. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కనిపిస్తుది. దాన్ని నిరుద్యోగులు సెలక్ట్ చేసుకోవాలి. ఆధార్ ద్వారా అభ్యర్థులు ఐడెంటిటీని ధృవీకరించుకోవాలి. ఆ తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ వారికి కనిపిస్తుంది. అభ్యర్థులు ఇచ్చిన ఫోన్ నంబరుకు ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని అభ్యర్థుల ఇ-మెయిల్ కు వచ్చిన ఓటీపీతో సరిచూసుకోవాలి. ఆ తరువాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. నిరుద్యోగులు అత్యధిక చదువు ఏంటో అందులో పేర్కొనాలి. ఎన్ని మార్కులు సాధించారనే విషయాన్ని సైతం ఎంటర్ చేయాలి.
వారు మెమోలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరంలేదు: కాలేజీ చదువు పూర్తి చేసిన వారు.. ఏ విద్యాసంస్థలో చదివారో పేర్కొనాలి. ఆ విద్యాసంస్థ పేరు, అది ఏ జిల్లాలో ఉన్నదో కూడా తెలపాలి. ఏ గ్రూపు చదివారు.. వంటి వివరాలను సైతం నమోదు చేయాలి. ఇంకా మార్కుల మెమోలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్, పదవ తరగతి చదివినవారు సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరంలేదు. ఈ విధంగా వివరాలన్నీ సమర్పించి అప్లికేషన్ ను పూర్తి చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా దాదాపు 64,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా.


