Medical Colleges Issue: ఏపీలో మెడికల్ కళాశాలల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీలో పులివెందుల తప్ప ఏ మెడికల్ కళాశాలను నిర్మించలేదంటూ మరోసారి మంత్రి సత్యకుమార్ యాదవ్ అబద్ధాలు వల్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరోసారి అందరి ముందు అబద్ధాలు చెప్పారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టలేదని, కేవలం పులివెందులలో మాత్రమే కళాశాల నిర్మాణం పూర్తి చేశారంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
వాస్తవం ఏంటి..
వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2020లో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 2023 నాటికి మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, విజయనగరం కళాశాలలు పూర్తయి 2023-24 విద్యా సంవత్సరంలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. నేషనల్ మెడికల్ కమీషన్ 150 సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లు మంజూరు చేసింది. ఇప్పుడీ 5 కళాశాలల్లో విద్యార్ధులు మూడో సంవత్సరంలో అడుగెట్టబోతున్నారు. గత సంవత్సరం అంటే 2024 నాటికి పాడేరు, పులివెందుల కళాశాలలు పూర్తయినా అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం పులివెందుల కళాశాల నిర్వహించలేమంటూ చేతులెత్తేయడంతో ఆ కళాశాలలో తరగతులు ప్రారంభం కాలేదు. ఇక పాడేరులో మాత్రం కేవలం 50 సీట్లు చాలనడంతో గత ఏడాది తరగతులు మొదలయ్యాయి. మిగిలిన పది కళాశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఇదంతా కళ్ల ముందు కన్పిస్తున్నా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక్క కళాశాల కూడా నిర్మించలేదంటూ అబద్ధాలు చెప్పడంపై జనం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా 10 మెడికల్ కళాశాలల్ని పీపీపీ పద్ధతిలో పూర్తి చేసేందుకు సిద్ధమౌతూనే ఉంది.
ఇప్పుడు కొత్తగా ఈ విద్యా సంవత్సరంలో నాడు జగన్ నిర్మించి ప్రారంభించిన మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం కళాశాలల్లో మొత్తం 60 పీజీ సీట్లు కూడా ఎన్ఎంసీ మంజూరు చేసింది. వీటిలో మచిలీపట్నంకు 12, నంద్యాలలో 16, రాజమండ్రిలో 16, విజయనగరంలో 12, ఏలూరులో 4 సీట్లు ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిందే నిజమైతే కేంద్ర ప్రభుత్వం లేని కళాశాలలకు పీజీ సీట్లు మంజూరు చేసిందా మరి..


