Andhra Pradesh Highway: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. ఉత్తరాంధ్రలో కీలకమైన మరో గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు కోస్టల్ హైవే నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇటీవలే ఈ హైవే గురించి సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్ధన పెట్టుకున్నారు. ఇప్పుడదే విషయంపై స్పష్టత వచ్చింది.
ఈ నేషనల్ హైవే మూలపేట పోర్టుకు కనెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండడమే కాకుండా వేగంగా వెళ్లేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. వైజాగ్ నుంచి భీమిలి వరకు ఇప్పుటికే జాతీయ రహదారి ఉంది. అంతేకాకుండా భోగాపురం దగ్గర అంతర్జాతీయ విమానశ్రయం నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు ఆరు లైన్ల రోడ్డు అవసరం ఉందని గుర్తించారు. ఇందులో భాగంగా భోగాపురం ఎయిర్ పోర్టుకు, మూలపేట పోర్టుకు అనుసంధానానికి పెంచే పనిలో ఉన్నారు. ఇదే వైజాగ్ సిటీకి లింక్ చేయనున్నారు.
వీటితో పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆక్వా రంగానికి కూడా మంచి ఊతం లభించినట్లు అవుతోంది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ హైవే పై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి సంబంధించిన ఆవశ్యకతను కేంద్రానికి వివరించారు. సుమారు 200 కి.మీ., గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు భూమి సేకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆదేశాలు రాలేదని అధికారులు అంటున్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అంటున్నారు. ఈ ప్రాంతంలో అటవీ, తీరప్రాంత స్థలాలు ఎంతవరకు అవసరమో గుర్తిస్తామన్నారు.
అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్ కంపెనీ ఏర్పాటుకు మూలపేట పోర్టు పరిధిలో మార్గం సుగమమం అయ్యింది. మరోవైపు పాలీఇథలీన్ పరిశ్రమను రూ.83,500 కోట్ల పెట్టుబడితో 1,250 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవలే అధికారులను సంప్రదించారు.


