Inter Exams : ఇంటర్ బోర్డులో ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైంది. ఇకపై ఇంటర్ పరీక్షలు అంటే మార్చి కాదు, ఫిబ్రవరి. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంటర్ బోర్డు ఈ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
ఫిబ్రవరిలోనే పరీక్షలు, ఏప్రిల్ నుంచి కొత్త అకడమిక్ ఇయర్:
సీబీఎస్‌ఈ తరహాలో, స్టేట్ సిలబస్‌లోనూ ఇంటర్ పరీక్షలు ఒక నెల ముందుగానే నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలోనే పరీక్షలు ముగించి, ఏప్రిల్ నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల విద్యార్థులు త్వరగా తమ ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం లభిస్తుంది.
సమూల మార్పులు.. ఎలా అంటే?
రోజుకు ఒకే పరీక్ష: గతంలో ఒకే రోజు రెండు గ్రూపుల విద్యార్థులకు వేర్వేరు పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు, ఒకరోజు ఒకే పరీక్ష ఉంటుంది. ఉదాహరణకు, ఎంపీసీ విద్యార్థులకు గణితం పరీక్ష ఉంటే, ఆ రోజు వారికి ఆ ఒక్క సబ్జెక్టు మాత్రమే ఉంటుంది.
సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్ వేరు వేరుగా: మొదట సైన్స్ గ్రూప్ సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయి. అవి పూర్తయిన తర్వాతే భాషా సబ్జెక్టుల పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థుల పరీక్షలు మొదలవుతాయి.
ప్రాక్టికల్స్‌కి ముందుగా ప్లాన్: ఫిబ్రవరిలో పబ్లిక్ పరీక్షలు ఉన్నందున, జనవరిలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వంలో సరికొత్త సంస్కరణలు:
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్ విద్యలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎస్సీఈఆర్టీ (SCERT) సిలబస్‌ను అమలు చేశారు. ఎమ్ బైపీసీ (M.Bi.P.C) లాంటి కొత్త గ్రూప్‌లను ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎంపీసీ విద్యార్థులు కూడా జీవశాస్త్రాన్ని చదువుకునే అవకాశం లభించింది. అలాగే, ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులు వారికి నచ్చిన ఇతర గ్రూప్ సబ్జెక్టులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా కల్పించారు.


