AP government- Womens Day 2026:మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలను ప్రకటించేందుకు సిద్ధమైంది. మార్చి 8న నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం రూపొందించిన పలు పథకాలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు చెందిన కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రుణ సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నారు.
NTR కళ్యాణలక్ష్మి పథకాన్ని..
డ్వాక్రా మహిళల కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు NTR కళ్యాణలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద రూ.10 వేల నుంచి అవసరాన్ని బట్టి రూ.లక్ష వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా బయట మార్కెట్‌లో ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుండగా, ఈ పథకం ద్వారా కేవలం పావలా వడ్డీకే రుణం అందించనున్నారు. దీంతో పేద,మధ్యతరగతి కుటుంబాలకు వివాహ ఖర్చుల భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/tomato-prices-have-dropped-in-telugu-states/
ఉన్నత విద్యకు అడ్డంకులు లేకుండా…
అదే విధంగా మహిళల ఉన్నత విద్యకు అడ్డంకులు లేకుండా చేయాలనే లక్ష్యంతో NTR విద్యాలక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. మహిళలు లేదా వారి పిల్లలు ప్రొఫెషనల్ కోర్సులు, పై చదువులు అభ్యసించేందుకు గరిష్టంగా రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. డ్వాక్రా కుటుంబాలకు చెందిన విద్యార్థినులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులు ఆపాల్సిన పరిస్థితి రాకుండా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది.
మహిళల నైపుణ్యాభివృద్ధి..
మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, NECC, అమృత యూనివర్సిటీ వంటి సంస్థలతో సెర్ప్ మరియు మెప్మా సంయుక్తంగా అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా మహిళలకు ఆధునిక నైపుణ్యాలపై శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
10 వన్ స్టాప్ సెంటర్లను…
మహిళల భద్రతను బలోపేతం చేసే దిశగా మరో 10 వన్ స్టాప్ సెంటర్లను రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. టెక్కలి, రంపచోడవరం, తిరువూరు, తణుకు, తుళ్లూరు, మాచర్ల, మార్కాపురం, కుప్పం, మదనపల్లె, ఆదోని ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం అద్దె భవనాల్లో సేవలు ప్రారంభించి, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.6 కోట్ల నిధులతో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కేంద్రాల ద్వారా బాధిత మహిళలకు న్యాయ సాయం, కౌన్సెలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్…
ఉద్యోగినుల కోసం రాష్ట్రంలో ఉన్న 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వివరాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త డిజిటల్ యాప్‌ను కూడా ఆవిష్కరించనున్నారు. ఈ యాప్ ద్వారా వసతి సౌకర్యాల సమాచారం తెలుసుకోవడంతో పాటు నేరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అదనంగా భవిష్యత్తులో మరో 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడనుంది.
వెదురు ప్రాసెసింగ్ యూనిట్..
ఉపాధి అవకాశాల పెంపు కోసం కూడా పలు చర్యలు చేపడుతున్నారు. రంపచోడవరంలో రూ.65 లక్షల వ్యయంతో వెదురు ప్రాసెసింగ్ యూనిట్‌కు, చిత్తూరులో రూ.70 లక్షలతో మునగ ప్రాసెసింగ్ యూనిట్‌కు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో ప్రాంతీయ శిక్షణ కేంద్రాల నిర్మాణానికి పునాది వేయనున్నారు.
తృప్తి క్యాంటీన్లను కూడా..
మహిళల ఆధ్వర్యంలో నడిచే మరో ఐదు తృప్తి క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదం చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న ఈ నిర్ణయాలు రాష్ట్రంలో మహిళా సాధికారతకు మరింత ఊతమిస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

