AP Cancer Screening: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం సంచలన ఫలితాలను వెల్లడించింది. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు రాష్ట్రంలో ఏకంగా 39 లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
లక్షల మందిలో క్యాన్సర్ లక్షణాల గుర్తింపు
ఈ భారీ స్క్రీనింగ్‌లో భాగంగా, వేలాది మంది ప్రజల్లో తొలి దశలోనే క్యాన్సర్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. ఈ పరీక్షల ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి . బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు 9,963 మంది , సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ లక్షణాలు 22,861 మంది, నోటి క్యాన్సర్ లక్షణాలు 26,639 మందికి గుర్తించారు. మొత్తంగా, 60 వేలకు పైగా (60,463) మందిలో అత్యంత సాధారణమైన ఈ మూడు రకాల క్యాన్సర్‌లకు సంబంధించిన లక్షణాలను గుర్తించడం జరిగింది. వీరిని తదుపరి చికిత్స, మెరుగైన నిర్ధారణ కోసం తృతీయ సంరక్షణ కేంద్రాలకు (Tertiary Care Centres) రిఫర్ చేస్తున్నారు.
ఎన్సీడీ 4.0 స్క్రీనింగ్‌తో ముందస్తు చర్యలు
క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి, సమర్థవంతంగా చికిత్స అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్సీడీ 4.0 (Non-Communicable Diseases) స్క్రీనింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మిగిలిన అర్హులైన ప్రజలందరికీ కూడా మరో 6 నెలల్లోగా ఈ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ముందస్తు స్క్రీనింగ్ ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స విజయావకాశాలు మెరుగుపడటంతో పాటు, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఈ మెగా క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక కీలకమైన ముందడుగుగా చెప్పవచ్చు.

