Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్High Alert: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు: అల్పపీడనంతో అప్రమత్తమైన విపత్తుల సంస్థ

High Alert: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు: అల్పపీడనంతో అప్రమత్తమైన విపత్తుల సంస్థ

High Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (AP Disaster Management Authority) అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

ముఖ్యంగా, మత్స్యకారులు బుధవారం లోగా తిరిగి తీరానికి చేరుకోవాలని, చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ప్రాంతాలవారీగా వర్ష ప్రభావం
సోమవారం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు.

ఇదిలా ఉండగా, కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు మొదటి హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

పల్నాడు జిల్లాలో అసాధారణ పరిస్థితి
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా నాగన్నకుంట, సుందరయ్య కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సత్తెనపల్లి-నరసరావుపేట ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రత్తిపాడు వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో గుంటూరు-పర్చూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

రాష్ట్రంలో వర్షాలు మొదలైన నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad