కేవలం 5 రూపాయలకు ఓ కాంట్రాక్టర్ కక్కుర్తి పడటంతో ఏకంగా రూ.5 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. వినియోగదారుల ఫోరంతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని భక్తులు అంటున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే అన్నవరం(Annavaram) దేవస్థానానికి భక్తులు వేలాదిగా వస్తుంటారు. అయితే అక్కడ మెుబైల్స్ లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
దీంతో అక్కడ( Mobile Deposit Counter) మెుబైల్ డిపాజిట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. అందుకు నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సదరు కాంట్రాక్టర్ రూ.5 కోసం కక్కుర్తి పడి రూ.5 లక్షలు చెల్లించుకున్నాడు.
అన్నవరం దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న మొబైల్ డిపాజిట్ కౌంటర్ కాంట్రాక్టర్‌కు రూ.5లక్షల భారీ జరిమానా విధిస్తూ కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం (Kakinada District Consumer Forum)సంచలన తీర్పునిచ్చింది.
ఏం జరిగిందంటే
2024 నవంబర్ 3న కాకినాడకు చెందిన న్యాయవాది జల్లి గంపల లక్ష్మీనారాయణ అన్నవరం వెళ్లారు. ఆలయంలోని ఓ డిపాజిట్ కేంద్రంలో మొబైల్ ఉంచారు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మొబైల్ తీసుకునేందుకు డిపాజిట్ కేంద్రం దగ్గరకు వెళ్లారు.
ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవటంతో
అక్కడి డిపాజిట్ కేంద్రంలో రూ.10 చెల్లించాలని సిబ్బంది చెప్పారు. అయితే అక్కడ రూ.10 అని బోర్డుపై ఎందుకు రాయలేదని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. వెంటనే ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో డిసెంబర్ 4న కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు.
రూ.5 వసూలు చేసేందుకే అనుమతి
అయితే రూ.5 వసూలు చేసేందుకు మాత్రేమే అనుమతి ఉన్నట్లు గుర్తించారు. విచారణ జరిపిన వినియోగదారుల ఫోరమ్ లక్ష్మీనారాయణ దగ్గర నుంచి అదనంగా వసూలు చేసిన రూ.5తో పాటు మానసిక క్షోభకు రూ.15 వేలు, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించారు.
సదరు గుత్తేదారు అన్నవరం దేవస్థానానికి రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు సీహెచ్. రఘుపతి వసంతకుమార్, సభ్యులు చెక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు తీర్పు ఇచ్చారు.