పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen) మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో మృతి చెందడంతో ఆయనను ఎవరో హత్య చేశారంటూ పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో పాస్టర్ మృతిపై లోతుగా దర్యాప్తు జరపాలని పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి పాస్టర్‌కు సంబంధించిన పలు సీసీ కెమెరాల వీడియోలు గుర్తించారు. ఆ వీడియోలో హైదరాబాద్ శివారు, కోదాడ, ఏలూరులో పాస్టర్ మద్యం కొనుగోలు చేసినట్లు ఆధారాలు సేకరించారు.
అలాగే తాజాగా మరో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో పాస్టర్ ప్రవీణ్ జగ్గయ్యపేట సమీపంలోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద ఓ ట్యాంకర్‌ను ఢీకొట్టబోయి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ తృటిలో తప్పించుకున్నారు. ట్యాంకర్ వెనుక టైర్ కింద పడబోయిన ప్రవీణ్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పటికే ప్రవీణ్ మృతి కేసు కొలిక్కి రావడంతో పోలీసులు త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించనున్నారు.