AP 10th Hall Tickets: ఏపీలో మార్చి 16 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యా శాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.
రాష్ట్రంలో మరో పది రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకూ స్కూళ్లలోనే వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులు.. పదో తరగతి పరీక్షలను ఇతర సెంటర్లలో రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఒత్తిడి అనేది సర్వసాధారణం. అందుకే పది రోజుల ముందుగానే హాల్ టికెట్లను విడుదల చేసి.. ఇంటి నుంచి పరీక్షా సెంటర్ వరకూ ఎంత దూరం ఉందో ముందే తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తుంది విద్యా శాఖ. మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్ టికెట్లను విడుదల చేసింది. బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్, మన మిత్ర వాట్సాప్ నంబర్, పాఠశాల విద్యాశాఖకు చెందిన లీప్ యాప్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. 9552300009 నంబర్‌కి HI అని మెసేజ్ చేస్తే హాల్ టికెట్ పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఉచిత ప్రయాణం
మరోవైపు పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఫ్రీగా ప్రయాణించవచ్చు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ మేరకు పరీక్ష రోజుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని, తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ సిబ్బందికి ఎండీ ఆదేశాలు జారీ చేశారు.
పరీక్షా సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని.. ముఖ్యంగా ఆరోగ్యకరమైన భోజనం, సరైన నిద్రను కలిగి ఉండాలని, ఒత్తిడి లేకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నారు.
ప్రణాళికాబద్ధమైన చదువు
ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయిస్తూ ఒక టైమ్ టేబుల్‌ను సిద్ధం చేసుకోవాలి. వెయిటేజీ ఎక్కువగా ఉన్న పాఠ్యాంశాలను ముందుగా పూర్తి చేయడం మంచిది. చదివిన వాటిని మర్చిపోకుండా ఉండటానికి ప్రతిరోజూ రాసి చూడటం, పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం చాలా ముఖ్యం. గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులలోని సూత్రాలు, సిద్ధాంతాల కోసం ఒక ప్రత్యేక నోట్ బుక్ నిర్వహిస్తే చివరి నిమిషంలో రివిజన్ సులభమవుతుంది.
Also Read: https://teluguprabha.net/telangana/vem-narender-reddy-resigns-from-the-post-of-cm-advisor/
పరీక్షా సమయంలో
పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి. మొదట 15 నిమిషాల సమయాన్ని ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవడానికి కేటాయించాలి. మీకు బాగా తెలిసిన సమాధానాలను ముందుగా గుర్తించి వాటిని రాయండి. సమాధానాలను స్పష్టంగా, అర్థమయ్యేలా రాయండి. కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. అలాగే సమయాన్ని గమనిస్తూ వేగంగా రాయడం అలవాటు చేసుకోవాలి. పరీక్ష పూర్తయిన తర్వాత అన్ని సమాధానాలకు నంబర్లు సరిగ్గా వేశారా లేదా అని ఒకసారి సరిచూసుకోవాలి.

