బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న 125 అడుగుల ఎత్తయిన డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున.. జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, అధికారులతో కలిసి సోమవారం ఉదయం పరిశీలించారు.
పనుల సత్వర పూర్తికి అధికారులకు మార్గనిర్దేశనం చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ డా. బీఆర్ అంబేద్కర్ భావజాలాన్ని ఆకళింపు చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక అంతరాలను తొలగించి.. సమసమాజ స్థాపనతో సామాజిక సాధికారత కల్పించేందుకు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న అసలైన గ్రామ స్వరాజ్యం స్థాపనకు కృషిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా డా. బీఆర్ అంబేద్కర్‌కు అత్యున్నత గౌరవం కల్పిస్తూ నగరం నడిబొడ్డున విశాల స్థలంలో అంబేద్కర్ విగ్రహం రూపుదిద్దుకుందన్నారు. ఆ మహనీయుని జీవితంలోని ప్రధానఘట్టాలను నేటి తరం తెలుసుకొని, భావితరాలకు అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్మారక మ్యూజియం, స్మారక హాల్, గ్రంథాలయం వంటివాటితో అత్యంత ఉన్నతంగా తయారవుతోందని.. త్వరలోనే విగ్రహావిష్కరణ వేడుకను నిర్వహించేందుకు కృషిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
సామాజిక సమతుల్యత లక్ష్యంగా..
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక సమతుల్యత, విప్లవాల ఆశయాల స్ఫూర్తితో 70 ఎకరాల విశాల ప్రాంతంలో రూ. 400 కోట్లతో బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం చారిత్రాత్మకంగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. చివరిదశలోఉన్న పనులను సత్వరం పూర్తిచేసి ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. డా. అంబేద్కర్ తన జీవితంలో స్పృశించిన అంశాలను, ఒడుదొడుకులను, కీలక ఘట్టాలను తెలియజెప్పేలా గొప్ప ప్రాంతంగా అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు విలువైన సలహాలు సూచనలు ఇస్తున్నారని.. ఆయన మార్గనిర్దేశనం మేరకు పనులను ప్రణాళికాయుతంగా చేపడుతున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ ప్రత్యేక చొరవ, కృషితో ప్రాంగణం ఉన్నతంగా రూపుదిద్దుకుంటున్నట్లు మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.
మంత్రుల వెంట సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీవీ విజయభారతి, ఎస్‌సీ కమిషన్ సభ్యులు కాళే పుల్లారావు, దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ కోఆర్డినేటర్ కేవీ రమణరావు, మాదిగ పోరాట పరిరక్షణ సమితి ప్రతినిధి మేదర సురేష్, కేసీపీ ప్రాజెక్టు సీఎండీ కె.అనిల్ కుమార్, డైరెక్టర్ వాసుదేవరావు, చీఫ్ ఇంజనీర్ నరసింహరావు, ప్రాజెక్టు మేనేజర్లు కె.కృష్ణమోహన్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.