గౌరవ సభ కొలువుదీరింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ తర్వాత మంత్రులు, అనంతరం మాజీ సీఎం జగన్ సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. 16వ శాసనసభ ఉదయం 9 గంటల 46 నిముషాలకు అమరావతిలోని అసెంబ్లీహాల్లో జాతీయ గీతాలాపనతో ఘనంగా ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొత్తం 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రమాణాలను పూర్తి చేశారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. శనివారం ఉదయం 10.30 గంటలకు శాసనసభ ప్రారంభం అవ్వగా, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీ అంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత గౌరవ సభలో ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద తొలుత స్వాగతం పలికిన కూటమి సభ్యలు సీఎం చంద్రబాబు సభలో అడుగు పెట్టగానే.. లేచి నుల్చొని హర్షధ్వానాలు చేశారు. ఆయన కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ లోపలికి వచ్చారు. ఆయనకు పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. ఆయన తన ఛాంబర్‌లో కి రాగానే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు. సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అంతకు ముందు తుళ్లూరు మండలం వెంకటపాలెంలో బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
పేరు ఉచ్ఛారణలో తడబడిన మాజీ సీఎం జగన్
చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో సహా సభ్యులందరికీ జగన్ అభివందనం చేయగా.. జగన్‌కు సీఎం చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారు. సభలో ఉన్న కొద్దిసేపు జగన్ ముభావంగానే కనిపించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలో సభ్యుడిగా తన పేరు ఉచ్ఛారణలో తడబడ్డారు. తొలుత వైఎస్ జగన్‌మోహన్ అనే నేను అని పలికి ఆ తరువాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అని సవరించుకున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా లేకపోయినా కూడా మంత్రుల తరువాత 26వ సభ్యుడిగా జగన్ తో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ పక్కనే పెద్దిరెడ్డి మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన ముఖ కవళికలను బిగ్ స్క్రీన్‌పై అందరూ ఆసక్తిగా గమనించారు. చంద్రబాబు, మంత్రులు, ఎమ్యెల్యేలు, జగన్ సభలోకి వచ్చి కూర్చోగానే బీజేపీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన వద్దకు వెళ్లి చేతులు కలిపి నమస్కరించారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ కూడా జగన్ వద్దకు వెళ్లి చేతులు కలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన విషయం విదితమే. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణానికి వెనుక గేటు నుంచి చేరుకున్నారు. ఆయన నేరుగా సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అడుగు పెట్టారు. అప్పటి వరకూ గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకరు ఛాంబరులోనే వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ ఉండిపోయారు. ప్రమాణం చేసేందుకు అయిదు నిమిషాల సమయం ఉండటంతో చివరి బెంచ్‌లో కూర్చున్నారు. అనంతరం సభలో కూర్చోకుండా ఎమ్మెల్యే జగన్ వెళ్లిపోయారు. ఇలా సీటులో కూర్చోకుండా ఇంతవరకూ ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదంటూ ధూళ్లిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన రాజ్యం లాక్కున్నట్లు ఫీల్ అయినట్లు అనిపించిందని ధూళ్లిపాళ్ల వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడ్డాయని చెప్పారు.

అగౌరవం కలిగేలా ప్రవర్తించవద్దు
జగన్ వ్యవహారశైలి ఏ విధంగా ఉన్నప్పటికీ అతనికి అగౌరవం కలిగేలా ప్రవర్తించరాదని తెలుగుదేశం శాసనసభ్యులకు చంద్రబాబు స్పష్టం చేయడమే కాకుండా జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకి అనుమతించాలని ఆదేశించారు. ప్రస్తుతం అసెంబ్లీలో జగన్‌కు కావాల్సిన సంఖ్యా బలం లేకపోవడంతో గేటు బయట దిగి కాలినడకనే లోపలకు రావాల్సి ఉంటుంది. ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు అసెంబ్లీకి బయల్దేరే ముందే ఎమ్మెల్యేలకు సూచించారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయొద్దని, శాసనసభలో రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని ఆదేశించారు. జగన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని తమకు స్పష్టం చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకార వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు.