Andhra Pradesh Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అయితే, ఈసారి సభలో చర్చల కంటే కూడా ఎమ్మెల్యేల ‘హాజరు’ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా సమావేశాలకు గైర్హాజరవుతుండటంతో, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దొంగ సంతకాలకు చెక్ – ఇక డిజిటల్ హాజరు!
గతంలో కొందరు సభ్యులు సభకు రాకుండానే, లోబీల్లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని అడ్డుకోవడానికి స్పీకర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. “ప్రజల పక్షాన గొంతు వినిపించాల్సిన ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతభత్యాలు పొందడం ఎంతవరకు సబబు?” అంటూ స్పీకర్ గతంలోనే తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
Also Read:YS Jagan security – వైఎస్ జగన్ భద్రతపై కేంద్రానికి వైసీపీ లేఖ
వైసీపీ ఎమ్మెల్యేలకు గండం?
ప్రస్తుతం వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే పరిమితమై, సభా వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏదైనా సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు సభకు గైర్హాజరైతే, వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అనేది కేవలం లాంఛనమే తప్ప, అది సభలో పాల్గొన్నట్లు లెక్కలోకి రాదని అసెంబ్లీ వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గవర్నర్‌తో స్పీకర్ భేటీ
సమావేశాల ప్రారంభానికి ముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.
బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాల్సిన ఈ తరుణంలో, ప్రతిపక్షం సభకు వస్తుందా లేక గైర్హాజరీతో అనర్హత ముప్పును కొనితెచ్చుకుంటుందా అన్నది వేచి చూడాలి. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది రేపటి BAC (Business Advisory Committee) సమావేశంలో ఖరారు కానుంది.

