Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మూడు ముఖ్యమైన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UDA) లకు ఉపాధ్యక్షులుగా (వైస్ ఛైర్‌పర్సన్‌లుగా) ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది.
మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) వైస్ ఛైర్‌పర్సన్‌గా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)కి , నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) వైస్ ఛైర్‌పర్సన్‌గా నెల్లూరు జిల్లా జేసీకి , ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (EUDA) వైస్ ఛైర్‌పర్సన్‌గా ఏలూరు జిల్లా జేసీకి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తక్షణమే అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.
సాధారణంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు ప్రత్యేకంగా వైస్ ఛైర్‌పర్సన్‌లను నియమిస్తారు. అయితే, ఈ కొత్త నిర్ణయం ద్వారా జిల్లా స్థాయిలో పరిపాలనపై పూర్తి పట్టున్న సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉండే జాయింట్ కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించడం వల్ల అభివృద్ధి పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్‌తో సమన్వయం సులభతరం అవుతుంది.
నగర ప్రణాళిక, మౌలిక వసతుల కల్పన, భూ వినియోగ మార్పులు (Land Conversions), స్థానిక సంస్థలతో సమన్వయం వంటి కీలక అంశాల్లో జేసీలు మరింత సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, పథకాలను వేగంగా అమలు చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఈ పరిపాలనాపరమైన మార్పు, పట్టణాభివృద్ధిని మరింత పారదర్శకంగా, జవాబుదారీగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.


