AP Cabinet Decisions: సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 19 అజెండా అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అమరావతిలోని 13 గ్రామాల పరిధిలో 34,946 ఎకరాల భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఉద్దండరాయునిపాలెంలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌కు ఆమోదం లభించింది. 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
అమరావతి పరిధిలో భూమి లేని 1575 పేద కుటుంబాలకు పెన్షన్ కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇక అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను కృష్ణా నది నుంచి డ్రెడ్జింగ్ చేసుకునేందుకు సీఆర్‌డీఏకు వెసులుబాటు కల్పించింది. రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఐఎస్ అధికారులకు నివాస సముదాయ భవనాలు పూర్తి చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.సీబీఐ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతర కీలకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించేందుకు పచ్చజెండా ఊపింది.
ఇక కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల నిర్మాణానికి హడ్కో కింద రూ.1000 కోట్లు రుణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కోకో రైతులను ఆదుకునేందుకు 14.88 కోట్ల మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఏపీఐఐసీ పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అదనంగా 790 ఎకరాలు సేకరించేందుకు ఆమోదం లభించింది. నెల్లూరు జిల్లాలో భాతర పెట్రోలియం కెమికల్ పరిశ్రమ కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించింది.
ALSO READ: బంగారుపాళ్యంలో టెన్షన్..జగన్ రాకముందే రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు
మరోవైపు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అలాగే ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లల్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్స్ పెట్టారని సీఎం దృష్టికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకెళ్లారు. ఈమేరకు ఆధారాలు చూపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ చేస్తున్న తప్పుడు విధానాలను విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. ఈ అంశంపై విచారణకు ఆదేశిస్తామని చంద్రబాబు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదని చంద్రబాబు క్లాస్ పీకారు. మహిళా ఎమ్మెల్యేను కించపరిస్తే ఘాటుగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చేసిన మంచిని ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.


