రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం(AP Cabinet) ముగిసింది. ఈ భేటీలో మొత్తం 14 అంశాల ఎజెండాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది.
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. ఇక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో ఈఎస్‌ఐ(ESI) ఆస్పత్రిని 100 పడకలకు పెంచేందుకు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఎస్‌ఐపీబీ(SIPB) ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. అలాగే రామాయపట్నంలో బీపీసీఎల్(BPCL) రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది.
ముఖ్యంగా రాబోయే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి, విధానాలు ఖరారు చేయనుంది.