Friday, January 16, 2026
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet: 35 అంశాలే ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం

AP Cabinet: 35 అంశాలే ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం

AP Cabinet Key Decisions: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేబినెట్‌ భేటీలో దాదాపు 35కు పైగా అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. లాజిస్టిక్‌ రంగంలో వచ్చే ఐదేళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ఆమోదించింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై చర్చించింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో జల్‌జీవన్ ద్వారా నీటి సరఫరాకు రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీపై కూడా మంత్రులు చర్చించారు. ఇక, కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాఠశాల కిట్‌ల పంపిణీ కోసం రూ.944.53 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది. సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇక, వివిధ సంస్థల భూకేటాయింపులకు సైతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏసీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

- Advertisement -

పాఠశాల విద్యార్థులకు కిట్‌ల పంపిణీ..

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కోసం భారీ కేటాయింపులు చేసింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్‌ల పంపిణీ నిమిత్తం రూ. 944.53 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా రూ. 19,391 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా సుమారు 11,753 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేసింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో మొత్తం 14 సంస్థల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. అమరావతిలో కృష్ణా నదీ తీరంలో ప్రతిష్టాత్మకమైన మెరీనా ప్రాజెక్టు ఏర్పాటుకు కూడా మంత్రివర్గం అంగీకరించింది. పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే గేమ్ ఛేంజర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త వ్యూహాలను ఖరారు చేసింది. ఇక, సంప్రదాయేతర ఇంధన , విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులపై ఈ భేటీలో తీర్మాణం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News