AP new districts: గత ప్రభుత్వ హయాంలో ‘అశాస్త్రీయంగా’ జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే లక్ష్యంతో, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. మంత్రులు నారాయణ, అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్న ఈ సమావేశంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన కీలక మార్గదర్శకాలపై అధికారులు మరియు మంత్రులు లోతుగా చర్చించారు.
హామీ నెరవేర్చే దిశగా…
జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చడమే తమ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, కొన్ని జిల్లాల సరిహద్దుల మార్పుపై ముఖ్యమంత్రి చేసిన సూచనల అమలుపై దృష్టి సారించారు.
కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రూపొందించిన నివేదికపై సీఎం కొన్ని మార్పులు, సూచనలు చేయగా, వాటిపైనే ఈ తాజా సమావేశంలో చర్చ జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మరోసారి సమావేశమై తుది నివేదికను రూపొందించిన అనంతరం ముఖ్యమంత్రికి అందజేయనున్నారు.
రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ద్వారా పరిపాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని, ప్రజల ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు.


