IAS Officers| గత పదేళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు డీవోపీటీ(DOPT) ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఐదుగురు ఐఏఎస్ అధికారుల్లో నలుగురికి మాత్రమే పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. ఇక గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఆమ్రపాలి(Amrapali Kata)కి కీలకమైన పోస్టింగ్ ఇవ్వడం విశేషం.
ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించడంతో పాటు టూరిజం అథారిటీ సీఈవోగా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి.వాణిమోహన్‌ను బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోలా భాస్కర్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్ చేశారు. ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించారు. అలాగే జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక రోనాల్డ్ రోస్‌కు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టడం చర్చగా మారింది.
కాగా ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కేంద్రం ఇరు రాష్ట్రాలకు ఐఏఎస్ అధికారులను కేటాయించిన విషయం విధితమే. అయితే ఇందులో ఏపీ క్యాడర్‌కు కేటాయించిన కొంతమంది అధికారులు తెలంగాణలో.. తెలంగాణ క్యాడర్‌కు కేటాయించిన అధికారులు ఏపీలోనూ పనిచేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలని ఆదేశించింది. దీంతో ఏ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన అధికారులు ఆ రాష్ట్రంలో రిపోర్ట్ చేశారు.