Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP CM Chandrababu: సీపీఐ నేతలపై కేసులు ఎత్తేయండి

AP CM Chandrababu: సీపీఐ నేతలపై కేసులు ఎత్తేయండి

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుని సీపీఐ నేతలు కోరారు. ఒక్క కడప జిల్లాలోనే వేలాది ఎకరాల కబ్జాకు గురయ్యాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనంపై విచారణ చేయాలన్నారు. మూడు రాజధానుల పేరుతోనూ విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేశారని వివరించారు. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలను బెదిరించి గత పాలకులు భూములు కాజేశారని ఫిర్యాదు చేశారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, భూ కుంభకోణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జల్లి విల్సన్, జే.వి.ఎస్.ఎన్.మూర్తి, ఓబులేసు కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందించారు. అమరావతి, పోలవరం నిర్మాణం, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల భారాలు, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడినందుకు సీపీఐ నేతలు, అనుబంధ సంఘాల నేతలపై గత ప్రభుత్వం కేసులు బనాయించిందని, వాటిని ఎత్తేవేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

- Advertisement -

పోలవరంను మొదటి దశ వరకే పరిమితం చేయాలనే నిర్ణయాన్ని గత ప్రభుత్వం సమర్థించడం విచారకరమని, 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం జరగాలని కోరారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సీపీఐ నేత నారాయణ మధ్య కాలేజీ రోజుల అంశం గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. నాడు చేసిన రాజకీయ పోరాటాలు, విద్యార్థి రాజకీయాలను నెమరువేసుకుని కాసేపు ఉల్లాసంగా గడిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News