Kasibugga Stampede Updates: శ్రీకాకుళంలో కాశీబుగ్గలో ప్రమాద ఘటన జరిగింది. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం, ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భారీ రద్దీ కారణంగా ఆలయంలోని రెయిలింగ్ ఊడిపోయి, భక్తులు కిందపడడంతో తొక్కిసలాట జరిగింది.
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడైంది. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని తక్షణం స్థానిక ఆసుపత్రిలో చికిత్సకి తరలించారు. రోడ్డు విస్తరణ లేకుండా ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీఎం చంద్రబాబు స్పందన..

పవిత్ర కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ దుర్ఘటన తనను కలచివేసిందని చంద్రబాబు అన్నారు. భారీగా భక్తులు మరణించటం విషాదకరమన్న సీఎం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదం తనను షాక్ కి గురిచేసినట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఏకాదశి రోజున ఇలా ప్రమాదం చోటుచేసుకోవటంపై బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఘటనపై పోలీసులతో పాటు ఇతర అధికారులతో ఆమె చర్చించారు. దుర్ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆమె ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.


