CM Chandrababu Naidu To Visit Singapore: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 26 నుంచి 31 వరకు కొనసాగే ఈ పర్యటనలో “బ్రాండ్ ఏపీ”ని ప్రపంచ వేదికపై ప్రచారం చేసి, పెట్టుబడులను రాబట్టనున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు చేపట్టనున్న రెండో విదేశీ పర్యటన ఇది. అంతకుముందు ఆయన దావోస్ వెళ్లారు.
పెట్టుబడులే లక్ష్యంగా..
ఈ పర్యటనలో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, నౌకాశ్రయాలు, నీటి వనరులు, భూ వనరులు, 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల గురించి వివరించి, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించనున్నారు. వివిధ కంపెనీల సీఈఓలు, సీనియర్ ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు.
ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/women-empowerment-conference-on-september-14-and-15th/
తొలుత తెలుగువారిని..
పర్యటనలో భాగంగా తొలుత సింగపూర్‌లో స్థిరపడిన తెలుగు వారిని కలవనున్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, పేదరిక నిర్మూలనకు రాష్ట్రం చేపట్టిన P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్) విధానాన్ని విజయవంతం చేయడానికి చొరవచూపాలని పిలుపునివ్వనున్నారు.
ప్రధానంగా ఈ రంగాలలో..
ప్రధానంగా పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు (AI), డేటా కేంద్రాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ఆయన దృష్టి సారిస్తారు. నవంబర్‌లో జరగనున్న విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకు ప్రముఖులను ఆహ్వానిస్తారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్ అంశాలపై వ్యాపార రౌండ్‌టేబుల్ సమావేశాలు, ప్రత్యేక బిజినెస్ రోడ్‌షోలో పాల్గొంటారు. సింగపూర్‌లోని కీలక మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ కేంద్రాలను కూడా చంద్రబాబు సందర్శిస్తారు.


