Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వివాదాస్పద దేవాలయ భూములకు త్వరలో విముక్తి

AP: వివాదాస్పద దేవాలయ భూములకు త్వరలో విముక్తి

రాష్ట్రంలోని దేవాలయాలు, ధార్మిక సంస్థల భూముల పరిరక్షణకై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 6వ అంతస్థులోని శ్రీ మల్లిఖార్జున మహా మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవాదాయ భూములను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివాదాస్పద దేవాలయాల భూములకు త్వరలో విముక్తి కల్పించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పలు మార్లు అధ్యయనం చేసిన తర్వాత ప్రధానంగా దేవాదాయ భూముల వివరాల వెరిఫై అంశం, ప్రాథమిక ఆధారాలు, వివాదంలో ఉన్న భూములు, 22A1C క్రింద రిజిస్టర్ అయిన భూములు, సర్వే నంబర్ కు సంబంధించిన సబ్ డివిజన్లు, ఎండోమెంట్, రెవెన్యూ శాఖల ఆధీనంలో ఉన్న భూములు, వివాదాలు లేని ఆస్తులు, శాశ్వతంగా భూమి భద్రత, రీసర్వే సెటిల్ మెంట్ రికార్డులు, 1B ప్రతుల పరిశీలన, కోర్టు కేసుల విషయాలు, అన్యాక్రాంతం అయిన భూములు తదితర అంశాలపై ఈరోజు జరిగిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించామన్నారు.

- Advertisement -

దేవాదాయ శాఖకు సంబంధించి ఎండో మెంట్ కమిషనర్లు, 26 జిల్లాల దేవాదాయ శాఖ అధికారులు, దేవాలయాల ఈవోలు, అధికారులు, కార్యనిర్వాహణాధికారులు పాల్గొన్న సమీక్షా సమావేశంలో దేవాలయాల భూములు కాపాడటం కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశామని వెల్లడించారు. ఇప్పటికే దేవాదాయ శాఖ భూములను కన్జర్వేషన్ ల్యాండ్ గా ఇవ్వాలని రెవెన్యూ శాఖతో చెప్పామన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్ వో సీ జారీ చేసిన విషయం మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి స్థాయి నుండి క్షేత్ర స్థాయి ఉద్యోగుల వరకు దేవాదాయ శాఖ ఆస్తులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేవాదాయ భూములు దేవుడికే చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దేవుడికి రావాల్సిన ఆదాయం సక్రమంగా రాకపోతే కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు.

రాష్ట్రంలోని దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల రికార్డులను భద్రపరిచే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే సంబంధిత సాఫ్ట్ వేర్ ను రూపొందించి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఒక్కసారి ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో పొందుపరిచాక క్లాసిఫికేషన్ చేస్తామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,09,000 ఎకరాలను గుర్తించిన దేవాదాయ శాఖ వాటి పరిరక్షణకు తగు చర్యలు చేపట్టిందన్నారు. వివాదాల్లో ఉన్న దేవాదాయ భూముల సమస్యలను సత్వరం పరిష్కరించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 175 దేవాలయాల్లో పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ భూముల విషయంలో ఎవరైనా ఉద్యోగులు అవినీతికి పాల్పడితే తక్షణమే సస్పెండ్ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అనకాపల్లి, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖకు చెందిన వందలాది ఎకరాల భూములను, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొన్ని ప్రాంతాల్లో దేవాదాయ భూములను రైతులు సాగుచేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అలాంటి ఘటనల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మానవతా ధృక్పథంతో వ్యవహరిస్తామన్నారు. అంతిమంగా దేవాదాయ భూములను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

దేవాలయాల భూముల విషయంలో కొందరు కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ కోర్టులకు వెళ్తున్నారన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక భూములు వివాదంలో ఉన్నాయని, కోర్టుల్లోనూ పలు భూముల కేసు తీర్పులు పరిశీలిస్తే కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఆన్ లైన్ ప్రక్రియతో ఈ వివాదాలన్నింటికి చెక్ పడుతుందన్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మన భూములు, మన ఆస్తుల పరిరక్షణ కోసం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా చేపడుతున్న సమయంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల ప్రక్రియను కూడా చేపట్టాలని నిర్ణయించామన్నారు. భూవివాదాలకు చరమగీతం పాడి పారదర్శకంగా వివాదాలు లేని ఆస్తులు ఆన్ లైన్ లో పొందుపరచడమే తమ ఉద్దేశమన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి ఒక్కో ప్రాంతాన్ని ఫైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసి సంబంధిత ప్రాంత దేవాలయాల ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో పొందుపరుస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు 6,000 చిన్న ఆలయాలకు సంబంధించి ధూప, దీప నైవేద్యాల క్రింద ప్రతి నెలా ఆన్ లైన్ ద్వారా రూ.5,000 లు నేరుగా దేవాలయాల అకౌంట్ లో జమ చేస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో 4 ఏళ్లుగా సంక్షేమ రాజ్యం అప్రతిహాతంగా కొనసాగుతుందని, భవిష్యత్ లో కూడా సంక్షేమ పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పాలన దేశానికి ఆదర్శం కావాలన్నారు. ప్రకృతి సహకరించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలి అని, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రతి ఒక్కరి కుటుంబాల సంక్షేమం కోసం మే 12వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు అత్యంత శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర విధానాలను అనుసరించి 500 మంది రుత్వికులతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో “చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం” ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారన్నారు. ఉదయం 4 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ రాత్రి 8.30 వరకు కొనసాగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విరామం ఉంటుందన్నారు. మహా పూర్ణాహుతితో యజ్ఞం ముగుస్తుందన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ యాగంలో రోజుకో ఆలయం చొప్పున దుర్గామల్లేశ్వర స్వామి, మల్లిఖార్జున స్వామి, సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, సింహాచల అప్పన్న స్వామి వార్ల శాంతి కళ్యాణాలు పెద్ద ఎత్తున వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఉదయం, సాయంత్రం వేళ జరగనున్న యాగం అనంతరం ప్రతి రోజూ సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు, చాగంటి వారి ప్రవచనాలు ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News