Saturday, July 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Amaravati: అమరావతి రాజధానికి మరో 20 వేల ఎకరాలకు గ్రీన్ సిగ్నల్!!

Amaravati: అమరావతి రాజధానికి మరో 20 వేల ఎకరాలకు గ్రీన్ సిగ్నల్!!

Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతి పరిధిలో మరో 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన 50వ సీఆర్‌డీఏ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

- Advertisement -

ఈ మీటింగ్‌లో మొత్తం 7 ప్రధాన అంశాలపై చర్చించి.. సీఏం, సంబంధిత అధికారులు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. వాటిలో భాగంగా అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాలను కలిపి మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించాలన్న ప్రపోజల్‌ను అథారిటీ అనుమతిని ఇచ్చింది. దీంతో పాటు అమరావతి పరిధిలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మందడం, రాయపూడి, పిచుకలపాలెం వంటి గ్రామాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్లు, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆర్ఎఫ్‌పీ పిలిచేందుకు ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా అమరావతి రాజధాని పరిధిలో నిర్మించనున్న ఫైవ్‌స్టార్ హోటళ్లకు సమీపంలో నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్లను నిర్మించాలనే ఆలోచనకు ఆమోదం లభించినట్లు సమాచారం. రాజధాని నిర్మాణ పనులకు ఇప్పటికే ఇసుక కొరత లేకుండా చూసేందుకు, ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టేషన్ ద్వారా ఇసుకను తవ్వుకునేందుకు సీఆర్‌డీఏకు అనుమతి లభించింది. రాబోయే రెండేళ్లలో నిర్మాణాలకు 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని సంబంధిత అంచనా వేశారు.

కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సీబీఐ, పుల్లెల గోపీచంద్ కు చెందిన బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎమ్మెస్కే ప్రసాద్ కు చెందిన క్రికెట్ అకాడెమీ, కిమ్స్ హాస్పిటల్ సహా 16 ప్రముఖ సంస్థలకు 65 ఎకరాల మేర భూమిని కేటాయించేందుకు కూడా సీఆర్‌డీఏ అంగీకరించింది.

ఇవే కాకుండా రాజధానిలోని ఈ – 15 రహదారిపై ఆరు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు కూడా ఆమోదం లభించింది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News