రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు ఆసుపత్రి ప్రసవాలన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనే జరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాల్లోనే వీలైనంత వరకు ఆసుపత్రి ప్రసవాలు జరగాలని,కేవలం హైరిస్క్ కేసులను మాత్రమే జిల్లా ఆసుపత్రిలకు రిఫర్ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఆయా ఆసుపత్రుల డాక్టర్లు, ఎఎన్ఎం, ఆశా వర్కర్లకు లక్ష్యాలను నిర్దేశించి నిరంతరం మానిటర్ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
ఆరోగ్య శ్రీ పథకం అమలుపై మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పథకంలో 3257 వివిధ ప్రొసీజర్లు ఉండగా వాటిలోని సింపుల్ ప్రొసీజర్లన్నీ ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ప్రీ ఆథరైజేషన్లు పెరిగి ఎక్కువ కేసుల్లో వైద్య సేవలు అందే విధంగా చూడాలని అన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక్క కేసుకూడా ప్రీఆథరైజేషన్ స్థాయిలో తిరస్కరణకు గురి కాకుండా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.ఇందుకుగాను డియంఇ,ఎపివైద్య విధాన పరిషత్ హెచ్ఓడిలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం గురించి మాట్లాడుతూ ఈవిధానంతో గ్రామాల్లో వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన రావాలని, అదే విధంగా కమ్యూనిటీ హెల్త్ పరిస్థితుల్లో మార్పులు రావాలని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.అంతేగాక ఆయా గ్రామాల్లో వాటర్ బోర్న్,వెక్టర్ బోర్న్ సంబంధిత వ్యాధులు బాగా తగ్గాలని అన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని,మరుగు దొడ్లను వినియోగించాలనే అవగాహనను కలిగించాలని చెప్పారు.మాతా శిశు మరణాల సంఖ్య తగ్గాలని,అందరికీ వ్యాథి నిరోధక టీకాలు వేయించి ఉండాలని అన్నారు.
అనంతరం క్యాన్సర్ వ్యాధి నిరోధక చర్యలు, వైద్య కళాశాలలు తదితర అంశాలపై సిఎస్ డా.జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. అంతకు ముందు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాల వివరాలను వివరించారు.
ఇంకా ఈసమావేశంలో ఎపి యంఎస్ఐడిసి విసి అండ్ యండి డి.మురళీధర్ రెడ్డి, వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్,ఆరోగ్యశ్రీ సీఈఓ ఎంఎన్.హరీంద్ర ప్రసాద్, కమీషనర్ ఎపి వైద్య విధాన పరిషత్ డా.వెంకటేశ్వర్,డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.డిఎస్.విఎల్ నర్సింహం పాల్గొనగా వీడియో లింక్ ద్వారా ఆర్థిక కార్యదర్శి ఎన్.గుల్జార్ పాల్గొన్నారు.