ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆర్థికంగా సహాయం చేసే పవన్ కళ్యాణ్.. తాజాగా ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్రముఖ సినీ నటి వాసుకి(పాకీజా)ని ఆదుకున్నారు. ఆమె కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. వాసుకి గతంలో పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆమె ప్రస్తుతం ఆర్థికంగా అత్యంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి, తక్షణమే సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో, పవన్ కళ్యాణ్ తరఫున శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ మరియు పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు నేరుగా వాసుకికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన వాసుకి, “ఇలాంటి సమయంలో నాకు అండగా నిలవడం పవన్ కళ్యాణ్ మంచితనానికి నిదర్శనమన్నారు. ఆయన చేసిన సహాయం మరిచిపోలేను. అవసరమైతే కాళ్ల మీద పడిపోయి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తోంది. నిన్నే నేను ఈ విషయం తెలియజేయగా.. వెంటనే స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది” అంటూ ఆమె తెలిపారు.
పవన్ కళ్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ నాయకత్వం.. ఆమె ఆరోగ్య పరిరక్షణ మరియు భవిష్యత్తు కోసం మరింత అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాగా.. సాధారణ ప్రజల సమస్యల పట్ల స్పందన చూపించడంలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుంటారు. పాకీజాకు ఇచ్చిన సహాయం ఆయనలోని మానవీయతకు నిదర్శనం. గతంలో కూడా సినిమా రంగానికి చెందిన పలువురు అభ్యుదయ స్థితిలో లేనివారికి, అలాగే పలు విపత్తుల్లో బాధితులకు సహాయం అందించిన సందర్భాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇలాంటి చర్యలు మరిన్ని ప్రజలకు ఆశాభావం కలిగించేలా ఉంటాయని, ఇది రాజకీయానికి అతీతంగా మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.