Pawan kalyan| వైసీపీకి గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చినా మార్పు రాలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. ఎలా పడితే అలా మాట్లాడతాం అంటే కదురదని హెచ్చరించారు. ఏలూరు జిల్లా జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్(Free Gas Cylinder) పథకం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని.. ప్రభుత్వం ప్రతి విషయాన్ని గమనిస్తోందని తెలిపారు. ఆడబిడ్డల భద్రత విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. కానీ తమ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపుతోందని భరోసా ఇచ్చారు. ‘దీపం 2.0’ కేవలం వంటింట్లో వెలుగు కోసం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకురావాలని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి రూ.2,684 కోట్లు, ఐదేళ్లకు రూ.13,425 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. 14 ఏళ్ల క్రితం ఐఎస్ జగన్నాపుథరం ఆలయానికి వచ్చానని.. ఇక్కడ స్వయంబుగా వెలసిన లక్ష్మినరసింహ స్వామిని ఎప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు.
అలాగే మాజీ సీఎం జగన్(Jagan) కుటుంబం ఆస్తుల వివాదంపైనా స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల(Sharmila)గురించి మాట్లాడుతూ.. ‘నా ప్రాణాలకు రక్షణ కావాలి. అదనంగా సెక్యూరిటీ కల్పించాలి అని అడిగారు. అమ్మా.. మీ అన్న కల్పించలేకపోయాడేమో కానీ.. మీ ప్రాణాలకు కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుంది. ఒక బాధ్యతగల నాయకురాలిగా మీరు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. మీరు అప్పీల్ చేసుకోండి.. సీఎం దృష్టికి తీసుకెళ్లి మీకు రక్షణ కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం” అని భరోసా ఇచ్చారు.
ఆయన మాట్లాడుతున్న సమయంలో అభిమానులు OG..OG అంటూ కేకలు వేశారు. దీంతో సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే బాగుంటుందని అభిమానులకు సూచించారు. సినిమాలు ఒక సరదా మాత్రమే.. కానీ సినిమాలు కూడా ఉండాలని చెప్పుకొచ్చారు.