Kakinada SEZ Issue కాకినాడ్ సెజ్ రైతులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. రైతుల భూముల్ని వెనక్కి ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్యను పరిష్కరించారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని కాకినాడ పరిధిలో ఉన్న సెజ్ అవార్డు భూముల సమస్య ఇప్పటిది కాదు. దాదాపు 20 ఏళ్లుగా నలుగుతోంది. గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఆయన దృష్టికి వచ్చింది. ఆ తరువాత 2019లో అధికారంలో వచ్చిన తరువాత తొలి రెండేళ్లు కోవిడ్‌లో గడిచిపోయింది. అనంతరం 2022లో అప్పటి జగన్ ప్రభుత్వం సెజ్ అవార్డు రైతులకు భూములు వెనక్కి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు. సెజ్ అవార్డు భూములు మొత్తం 3200 ఎకరాలు కాగా 2400 మంది బాధిత రైతులున్నారు. అవార్డు భూములంటే రైతుల ఇష్టం లేకపోయినా బలవంతంగా సేకరించినవి. జగన్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అప్పుడే భూములు వెనక్కి ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. 2024 వరకు దాదాపుగా 900 మంది రైతులకు చెందిన 11 వందల ఎకరాలు వెనక్కి ఇచ్చేశారు. ఆ తరువాత 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.
అప్పట్నించి మిగిలిన బాధిత రైతులు భూముల కోసం ఆందోళన చేస్తూ వచ్చారు. ఇటీవల ఈ ప్రాంతాన్నిసందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవిన్యూ మంత్రులతో మాట్లాడి సమస్యకు చెక్ పెట్టారు. మిగిలిన 1551 రైతులకు చెందిన 2180 ఎకరాలు వెనక్కి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్, స్టాంపు ఫీజులు వసూలు చేయవద్దని రెవిన్యూ శాఖ ఆదేశించింది. ఉచితంగా ఆయా రైతుల భూముల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చొరవతో రైతుల సమస్య పరిష్కారమైందంటున్నారు.


