Pawan kalyan warning to ycp leaders: వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మీరు అంతుచూస్తాం అంటే ఇక్కడ ఎవరు చేతులు కూర్చుని కూర్చోలేదు అంటూ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జల జీవన్ మిషన్ కింద నరసింహపురంలోని 12 ఎకరాల్లో రూ.1,290 కోట్లతో 31 మండలాల్లోని 1387 గ్రామాలకు తాగు నీటిని అందించే పథకాన్ని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఇతర ఎమ్మెల్యేలు, జనసేన నేతలు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటుచేసిన సభలో పవన్ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు కావాలన్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని.. అందుకు కొంత సమయం కావాలని తెలిపారు. గత పాలకులు అవినీతి మీద శ్రద్ధ పెట్టారు కానీ కనీసం మంచి నీరు కూడా అందించలేకపోయారని విమర్శించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల తీరుపై మరోమారు విరుచుకుపడ్డారు. 2029లో అధికారంలోకి వస్తే మ తమ అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారని మండిపడ్డారు. అసలు మీరు అధికారంలోకి రావాలి కదా? ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
వ్యక్తిగతంగా తనకు ఎవరిపై కక్ష ఉండదన్నారు. కానీ ప్రజలను భయపెడతాం.. రౌడీయిజం చేస్తామంటూ చూస్తూ ఊరుకోనన్నారు. రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయన్నారు. తలలు నరుకుతాం.. మెడకాయలు కోస్తామంటే తాము చొక్కా విప్పి నరకండని చూస్తూ ఉంటామా అని తెలిపారు. తాట తీసి తొక్కి పెడతామని మరోసారి తేల్చిచెప్పారు. వైసీపీకి 151 సీట్లు వచ్చినా తాను రెండు చోట్లా ఓడినప్పుడే ఎదిరించి నిలబడ్డానని గుర్తుచేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ భూములను ఇష్టారీతిన దోపిడీ చేశారని ఆరోపించారు. దేవుడి భూములు దోచుకున్న వాళ్లెవరూ ఎవరైనా సరే వదలమని హెచ్చరించారు. త్వరలోనే విచారణ జరిపిస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చన్నారు. కూటమిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని స్పష్టం చేశారు. నాయకులు కలిసి పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలో సీఎం చంద్రబాబు, తనకు మధ్య మంచి స్పష్టత ఉందన్నారు.