మంత్రి నారా లోకేష్(Nara Lokesh) రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే దావోస్(Davos)పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని మాజీ మంత్రి రోజా(Roja) విమర్శించారు. పక్క రాష్ట్రాల సీఎంలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో తిరిగి వస్తే.. సీఎం చంద్రబాబు(Chandrababu) మాత్రం ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్ అని సెటైర్లు వేశారు. దావోస్ పర్యటనకు స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, షూట్లకు రూ.20 కోట్ల వరకు ఖర్చు అయిందని ఆరోపించారు. కనీసం ఆ ఖర్చుల వరకైనా పెట్టుబడులు దక్కలేదని విమర్శించారు.
గతంలో వైఎస్ జగన్ పాలన చూసి అదానీ, అంబానీ, జిందాల్ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు పరిపాలన చూసి ఒక్క పారిశ్రామికవేత్త అయినా వచ్చారా? అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఎందుకు దావోస్ తీసుకెళ్లలేదని.. పవన్ వస్తే లోకేష్ స్థాయి తగ్గిపోతుందని తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. ముంబై నుంచి ఓ జూనియర్ అర్టిస్టును తీసుకొచ్చి ఆమెతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ వంటి పారిశ్రామిక వేత్తను బెదిరించారన్నారు. ఐపీఎస్, ఐఏఎస్‌లపై కక్ష సాధింపులకు పాల్పడితే ఎవరైనా పెట్టబడులు పెట్టేందుకు ఎలా ముందుకొస్తారని నిలదీశారు.