ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్‌లో జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ కుచ్లర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి, వైద్య పరిశోధనలో పరస్పర సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ మేరకు ఎంవోయూలు కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. భారతీయులు, ముఖ్యమంగా తెలుగువారి మేధాశక్తిపై తమకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాలను తమతో చర్చిస్తే.. ఆ మేరకు కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కోవిడ్ సమయంలో భారతదేశం అందించిన తోడ్పాటుకు జర్మనీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. యాంటీబయాటిక్, సర్జికల్ వస్తువులను ఆ సమయంలో భారతదేశం నుంచి తొలిసారి దిగుమతి చేసుకున్నామని, ఇప్పటికీ ఈ దిగుమతులు కొనసాగుతున్నాయని వివరించారు. యోగా, ఆయుర్వేదం లాంటి సాంస్కృతిక వైద్య విధానాలను తమ దేశంలోనూ అమలు జరిపేలా, మా వైద్య విధానాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చేలా అవగాహన ఒప్పందం కుదర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
పెట్టుబడులు పెట్టండి
తమ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో అద్భుతమైన వనరులతో మెడ్‌టెక్ జోన్ ఉందని, జర్మన్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇరుదేశాలకు మేలు చేకూరుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. వైద్య పరికరాల తయారీలో మెడ్ టెక్ జోన్ ముదువరుసలో ఉందని తెలిపారు. తమ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులు వృత్తి నిర్వహణ కోసం జర్మనీ వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఆ మేరకు వారికి కళాశాలల్లో జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో జర్మనీ దేశ సహకారం కావాలని కోరారు. నర్సింగ్ విద్యార్థులు జర్మనీ వెళ్లాలంటే రెండేళ్ల కాలపరిమితి ఉన్న వీసాలను మాత్రమే జారీ చేస్తున్నారని, ఇది చాలా తక్కువ సమయం అని చెప్పారు. కనీసం నాలుగేళ్ల కాలపరిమితి ఉన్న వీసాలను జారీ చేస్తే తమ విద్యార్థులకు మేలు చేకూరుతుందని వెల్లడించారు. తమ విద్యార్థులు ఏజెన్సీల ఆధారంగా జర్మనీ వస్తున్నారని, అలాంటి ఏజెన్సీలకు జర్మనీ దేశం నుంచి అధికారిక గుర్తింపు ఉండేలా చూస్తే.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని కోరారు.
వైద్య పరిశోధనపై దృష్టి
తమ రాష్ట్రంలో వైద్య పరిశోధనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని ఇప్పటికే డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో వైద్య పరిశోధనకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. జర్మనీ దేశ సాంకేతిక సహకారం కూడా తోడైతే వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జర్మనీలో వైద్య రంగంలో మానవ వనరుల కొరత ఉందని, దాన్ని అధిగమించేందుకు భారత్ సహకారం తీసుకుంటామని జర్మన్ కాన్సుల్ జనరల్ కుచ్లర్ మంత్రి విడదల రజినితో అన్నారు.
సంస్కరణలతో అద్భుత ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా అక్షరాస్యత పెరిగినట్లుగా తాము గుర్తించామని, ఇదెలా సాధ్యమైందని మంత్రిని కాన్సుల్ జనరల్ కుచ్లర్ అడిగారు. మంత్రి మాట్లాడుతూ విద్యా రంగంలో తమ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆ ఫలితంగానే అక్షరాస్యత అనూహ్యంగా పెరిగిందని మంత్రి తెలిపారు. నాడు- నేడు కింద పాఠశాలల్లో వసతులను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడం, అమ్మ ఒడి పథకం, గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన… లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా చదువును పేదలకు తమ ప్రభుత్వం అత్యంత చేరువ చేసిందని, బడికి పంపే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామని వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలోనూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గొప్ప గొప్ప సంస్కరణలను జగనన్న తీసుకొచ్చారని మంత్రి వివరించారు. ప్రతి గ్రామానికి హెల్త్ సెంటర్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చి ఇంటింటికీ ప్రభుత్వ వైద్యం అందేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కొత్తగా ఏర్పాటుచేస్తున్నామన్నారు. వైద్య వసతులు అమాంతలం పెంచుతున్నామన్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.16వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగనన్న అని వివరించారు. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ ప్రోగ్రాం తమ రాష్ట్రంలో అమలవుతున్నదని చెప్పారు. జర్మనీలో వైద్య సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో పదివేల మంది నర్సులను జర్మనీకి సేవలు అందించేందుకు పంపాలన్నా తమ వద్ద సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అవసరమైన సహకారం అందిస్తే చాలని వెల్లడించారు. భేటీలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఎంఈ డాక్టర్ నర్సింహం, జర్మన్ రాయబార కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
AP: జర్మన్ కాన్సుల్ జనరల్ తో మంత్రి రజిని ప్రత్యేక భేటి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES