Ex Gratia For Bapatla Accident Died People: బాపట్ల జిల్లాలోని బల్లికురవ సమీపంలో ఉన్న సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఆగస్టు 3, 2025 ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడిపోవడంతో ఈ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో పదహారు మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. అందులో ఆరుగురు మృతి చెందగా.. మరో పది మందికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల్లో ఇప్పటికే నలుగురి మృతదేహాలను వెలికితీయగా.. మరో ఇద్దరి మృత దేహాల కోసం అధికారులు గాలిస్తున్నారు. అలాగే గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే మిగిలిన వారికోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి బాపట్ల జిల్లా కలెక్టర్, జె.వెంకట మురళి, ఎస్పీ తుషార్ దూది పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి కారణంగా క్వారీ ప్రాంతంలో భద్రతా చర్యల లోపమే కారణమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు..
ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను, ప్రమాదం జరగడానికి గల కారణాన్ని తెలుసుకున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్రమైన విచారణ చేపట్టి.. నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకుంటామని, ఈ ప్రమాదంలో మరణించిన వారికీ తగిన సహాయం చేస్తామని ప్రకటించారు.
ఘటనపై స్పందించిన మాజీ సీఎం జగన్
సీఎం చంద్రబాబుతో పాటు, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం మిగిలిన కార్మికుల రక్షణ కోసం సహాయక చర్యలు కొనసాగుతుండగా, గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అధికారులు క్వారీ భద్రతా ప్రమాణాలపై దర్యాప్తు ప్రారంభించాలని సూచించారు. అటు ఈ ఘటనలో మృతి చెందిన వారికోసం బాపట్ల జిల్లా కలెక్టర్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ప్రమాదానికి సంబంధించిన కారణాలు కూడా త్వరలోనే బయటికి రానున్నాయి.


