AP Government Ban Political Activities in Schools: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలలను రాజకీయ జోక్యం లేని విద్యా కేంద్రాలుగా మార్చేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. పాఠశాలల్లో రాజకీయ ప్రభావాన్ని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. విద్యా ప్రాంగణాల్లో రాజకీయ పార్టీల చిహ్నాలు, జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు సహా ఇతర ప్రచార సామగ్రిని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు అకడమిక్ వాతావరణాన్ని కాపాడటమే ఈ చర్యల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
వారికి మాత్రమే అనుమతి..
కొత్త నిబంధనల ప్రకారం, రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు లేదా ఇతర ప్రచార సామగ్రిని పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించడం పూర్తిగా నిషేధం. అదే విధంగా, అనధికార వ్యక్తులు లేదా సంస్థలు పాఠశాలల్లోకి ప్రవేశించడంపై కూడా నిషేధం విధించారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) సభ్యులు మినహా, ఇతరులు పాఠశాలల్లోకి అనుమతించబడరు. ఈ నియమాలు.. విద్యా కార్యక్రమాలకు ఆటంకం కలిగించే అనవసర కార్యకలాపాలను నివారించడానికి రూపొందించారు.
అందుకే ఈ నిబంధనలు..
గత కొంతకాలంగా అనధికార వ్యక్తులు.. విరాళాలు లేదా బహుమతుల పేరుతో పాఠశాలల్లోకి ప్రవేశించి, విద్యా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. ఈ సమస్యను పరిష్కరించేందుకు… ఇకపై ఎవరైనా విరాళాలు లేదా సామగ్రిని అందించాలనుకుంటే, వాటిని నేరుగా హెడ్‌మాస్టర్ లేదా పాఠశాల యాజమాన్యానికి అందజేయాలని సూచించారు. తరగతి గదుల్లోకి ప్రవేశించడం, విద్యార్థులతో సంభాషించడం, ఫోటోలు లేదా వీడియోలు తీసుకోవడం వంటి చర్యలను నిషేధించారు. ఈ నిబంధనలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్వరుల్లో పేర్కొన్నారు. మొత్తంగా ఈ చర్యల వల్ల విద్యార్థుల గోప్యతను కాపాడడంతో పాటు, పాఠశాలలను రాజకీయ జోక్యం లేని అకడమిక్ కేంద్రాలుగా నిలపడానికి ఉద్దేశించబడ్డాయి.


