Minister Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. పాత రేషన్ కార్డులను తొలగించి, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల 25వ తేదీ నుండి పంపిణీ చేయనుంది. ఈ ప్రక్రియను ఈ నెల 31వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డుల మాదిరిగా ఉండేలా రూపొందించబడ్డాయి. వాటిపై కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ వంటి సాంకేతిక అంశాలు ఉంటాయి. వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా పూర్తిగా ఈ కొత్త స్మార్ట్ కార్డుల ద్వారానే జరగనుంది.
రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు డిజిటల్ పద్ధతులు ఉపయోగపడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 25వ తేదీ నుంచి జరగబోయే ఈ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.
అక్రమ రేషన్ బియ్యం రవాణా నియంత్రణ కోసం విజిలెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం, నెల్లూరు వంటి ప్రాంతాల్లో అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేయబడ్డాయని పేర్కొన్నారు. ఈ కొత్త కార్డుల్లో రాజకీయ నేతల ఫోటోలకు స్థానం ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం సుమారు 1.4 లక్షల కార్డులకు మ్యాపింగ్ సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని త్వరలోనే పరిష్కరించనున్నారు. బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. పోర్టుల వద్ద చెక్ పోస్టులను మరింత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన సహకార సంస్థలతో కలిసి పనిచేసి ఆదివాసి ఉత్పత్తులను రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తేవాలని సంకల్పించామని తెలిపారు.


