Minister Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆర్థిక మద్దతుగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 20,000ను మూడవ విడతలుగా అందించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆయన స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తొలి విడతగా త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ. 7,000 జమ చేయనున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
అటు ఆటో డ్రైవర్లకూ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. త్వరలో ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10,000 ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటికే రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి గతంలో వెళ్లిపోయిన కొన్ని ప్రముఖ సంస్థలు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/ex-cm-jagan-is-going-to-meet-ap-governer-today-night/
అయితే, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తోందని విమర్శించారు. వారు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలపై ప్రజలు విశ్వాసం చూపుతున్నారని, రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.


